TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Tue May 13, 2025

Q: వలస భారతదేశంలో అస్పృశ్యులు మరియు కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క కృషిని వివరించండి.

పరిచయం:
డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యానించినట్లుగా “ఒక సమాజం యొక్క పురోగతి ఆ సమాజంలోని పీడిత వర్గాల యొక్క ఉన్నతిపై ఆధారపడి ఉంటుంది.” ఈ మాట అస్పృశ్యులు మరియు కార్మికుల కోసం ఆయన జీవితకాల త్యాగాన్ని మరియు కుల రహిత సమాజ నిర్మాణం, స్వేచ్చాసమానత్వాలకు ఆయన చేసిన కృషినీ అద్దం పడుతుంది.

విషయం:
అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ కృషి

1. సామాజిక సంస్కరణలు:
a) మహాద్ సత్యాగ్రహం (1927): డాక్టర్ అంబేద్కర్ వేలాది దళితులను ముందుండి నడిపిస్తూ, మహాద్‌లోని చవ్దార్ సరస్సు నుండి నీరు తాగారు. ఈ సరస్సు నీటిని తాగే హక్కు గతంలో కేవలం ఉన్నత కులాలవారికి మాత్రమే ఉండేది. అంబేద్కర్ యొక్క ఈ చర్య సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా మొదలైన ప్రత్యక్ష పోరాటంగా నిలిచింది.
b) కాలరామ్ దేవాలయ సత్యాగ్రహం (1930–35): నాసిక్‌లోని కాలరామ్ దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలని డాక్టర్ అంబేద్కర్ దీర్ఘకాలిక నిరసనను చేపట్టారు. ఈ సత్యాగ్రహం మత సంస్థలలో అంటరానితనాన్ని ఎదిరించే సామాజిక పోరాటానికి ప్రతీకగా నిలిచింది.

2. సంస్థాగత కార్యక్రమాలు
a) బహిష్కృత్ హితకారిణీ సభ (1923): అస్పృస్యుల విద్య, సామాజిక గౌరవం, మరియు రాజకీయ హక్కులను ప్రోత్సహించేందుకు అంబేద్కర్ ఈ సంస్థను స్థాపించారు. సామాజిక న్యాయ సాధనకై ఆయన చేసిన కారక్రమాలకు ఇది మొదటి మెట్టుగా చెప్పవచ్చు.
b) షెడ్యూల్డ్ కులాల సమాఖ్య (1942): భారత స్వాతంత్ర్యం సమీపిస్తున్న సమయంలో స్వతంత్ర భారతదేశంలో దళితుల ప్రయోజనాల కోసం అంబేద్కర్ ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు.

3. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం

a) మనుస్మృతి దహనం (1927): మహాద్‌లో అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా దహనం చేశారు, దానిని కుల వివక్షకు మద్దతు కల్పించే గ్రంథంగా ఖండించారు. ఈ వివాదాస్పద చర్య దేశ వ్యాప్తంగా చర్చను రేకెత్తించింది.
b) కుల నిర్మూలన’ (1936): ఈ రచనలో అంబేద్కర్ హిందూ సమాజంలోని కుల వ్యవస్థ పునాదులను ఖండించారు. అంతేకాకుండా నిరుపయోగమైన సంస్కరణలకు బదులుగా సమూల సామాజిక పునర్మిర్మాణాన్ని డిమాండ్ చేశారు.

4. రాజకీయ ప్రాతినిధ్యం మరియు పూనా ఒడంబడిక (1932)

a) ప్రత్యేక నియోజకవర్గాలకై డిమాండ్: రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో, అంబేద్కర్ అణగారిన వర్గాలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు.
b) గాంధీతో పూనా ఒడంబడిక (1932): గాంధీ చేపట్టిన ఆమరణ దీక్షకు ప్రతిస్పందనగా, అంబేద్కర్ పూనా ఒడంబడికను అంగీకరించారు, దీని ద్వారా సంయుక్త నియోజకవర్గాల్లో దళితులకు కొన్ని రిజర్వడ్ సీట్లు కేటాయించబడ్డాయి. ఈ ఒప్పందం దళిత రాజకీయ ప్రాతినిధ్యంలో కీలక మలుపుగా నిలిచింది.

5. విద్య మరియు బౌద్ధ మతం
a) విద్యా ప్రోత్సాహం: విద్య విముక్తికి ఆధారమని అంబేద్కర్ విశ్వసించారు. దళిత విద్యార్థుల కోసం హాస్టళ్లు, పాఠశాలలను స్థాపిస్తూ , స్కాలర్‌షిప్‌లను అందించారు.
b) పత్రికలు: అంబేద్కర్ ‘మూకనాయక్’, ‘బహిష్కృత్ భారత్’, మరియు ‘జనత’ వంటి వార్తాపత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలు దళితుల సమస్యలను చర్చించడం మరియు పీడిత వర్గాలకు సామాజిక-రాజకీయ చైతన్యాన్ని అందించడంలో కీలక సాధనాలుగా నిలిచాయి.

కార్మిక హక్కులు మరియు సంక్షేమానికి అంబేద్కర్ అందించిన సహకారం
1. స్వతంత్ర లేబర్ పార్టీ స్థాపన (1936)
a) కుల వర్గ సమస్యలపై పోరాటం: డాక్టర్ అంబేద్కర్ పారిశ్రామిక కార్మికులతో పాటు అణగారిన కులాల సమస్యలను చట్టసభల్లో ప్రశ్నించేందుకు స్వతంత్ర లేబర్ పార్టీని స్థాపించి, కార్మిక ఉద్యమాలపై ఉన్నత కులాల ఆధిపత్యాన్ని సవాలు చేసారు.
b) శాసనసభలో ప్రాతినిధ్యం: ఈ పార్టీ ద్వారా అంబేద్కర్ బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యి, భూ సంస్కరణలు, కార్మిక హక్కులు, మరియు ఉపాధిలో కుల వివక్ష వంటి అంశాలను చట్టసభల్లో లేవనెత్తారు.

2. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక సంస్కరణలు (1942–46)
a) కనీస వేతనం మరియు మహిళలకు ప్రసూతి సెలవు: కార్మిక సభ్యుడిగా, అంబేద్కర్ కనీస వేతనం, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవు, మరియు కర్మాగారాల్లో మెరుగైన సదుపాయాల కల్పన వంటి కీలక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. b) ఎనిమిది గంటల పని దినం: ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ఎనిమిది గంటల పని దినాన్ని చట్టబద్ధం చేసి, కార్మికుల పరిస్థితులను మెరుగుపరిచారు.

3. ట్రేడ్ యూనియన్ మరియు కార్మిక హక్కుల కోసం పోరాటం

a) మిల్లు కార్మికులకు సహకారం: బొంబాయిలోని జౌళి మరియు పారిశ్రామిక కార్మికులతో కలిసి పనిచేసిన అంబేద్కర్, యూనియనీకరణను ప్రోత్సహించారు మరియు శ్రమదోపిడీకి వ్యతిరేకంగా నిరసనలను చేపట్టారు.
b) సామూహిక డిమాండ్లు: కార్మికులు ఒక్కటిగా సంఘటితమై తమకు అందాల్సిన న్యాయమైన హక్కులను డిమాండ్ చేసే విధంగా వారిని చైతన్యపరిచారు.

4. గ్రామీణ మరియు పట్టణ కార్మికులపై దృష్టి
a) గ్రామీణ కార్మిక సాధికారత: భూమిలేని దళితులు మరియు బానిస కార్మికుల దుస్థితిని అంబేద్కర్ వెలుగులోకి తీసుకురావడమేగాక, కుల వివక్ష మరియు శ్రమ దోపిడీల మధ్య ఉన్న సంబంధాన్ని చర్చించారు.
b) పట్టణ కార్మిక సంక్షేమం: పారిశ్రామిక కార్మికులకు గృహ సదుపాయాలు, పారిశుద్ధ్యం, మరియు ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలపై చైతన్యాన్ని అందిస్తూ, సమగ్ర కార్మిక సంక్షేమం పై దృష్టి సారించారు.

5. కార్మిక సంక్షేమానికై రాజ్యాంగ నిబంధనలు
a) ఆదేశిక సూత్రాలు: రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా, అంబేద్కర్, సమాన వేతనం, మరియు జీవనాధార హక్కులను నిర్దేశక సూత్రాలలో చేర్చారు.
b) కార్మికులకు అందాల్సిన గౌరవం: “అపవిత్ర” పని అనే కులవాద భావనను సవాలు చేస్తూ, కార్మిక గౌరవాన్ని రాజ్యాంగ విలువగా తీర్మానించారు.

ముగింపు
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపించిన అసాధారణమైన అంకితభావం భారతదేశంలో సామాజిక న్యాయానికి బలమైన పునాదిని ఏర్పరిచింది. ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు మరియు చట్టపరమైన రక్షణలను హామీ ఇచ్చిన మన భారత రాజ్యాంగం, బాబా సాహెబ్ కలలు కన్న సమసమాజ భారతదేశానికి నిలువెత్తు సాక్ష్యంగా చెప్పవచ్చు.