TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sat May 10, 2025

Q. నిజాం మరియు భూస్వామ్య జమీందార్లపై తెలంగాణ రైతుల సాయుధ పోరాటానికి దారితీసిన సామాజిక-ఆర్థిక కారణాలను పరిశీలించండి.

పరిచయం:
తెలంగాణ సాయుధ పోరాటం (1946–51), కమ్యూనిస్టు నాయకులు మరియు గ్రామీణ నాయకుల నేతృత్వంలో, నిజాం యొక్క నిరంకుశ పాలన మరియు భూస్వాములైన దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఒక చారిత్రక తిరుగుబాటుగా నిలిచింది. రైతుల గౌరవం మరియు న్యాయం కోసం మొదలైన ఈ పోరాటం ‘భూమి, భుక్తి, విముక్తి’అనే నినాదంతో కొనసాగింది.

విషయం:
I. సామాజిక కారణాలు:
1. నిజాం యొక్క నిరంకుశ పాలన
అ) నిజాం ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ మరియు భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులకు నిరాకరించింది.
ఆ) రాజ్యంలో రైతులకు రక్షణ చట్టాలు లేకపోవడంతో భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించారు. ఇ) బహిరంగ సమావేశాలు మరియు నిరసనలను క్రూరంగా అణచివేయడం వల్ల రహస్య ప్రతిఘటన ఉద్భవించింది.
2. వెట్టి వ్యవస్థ మరియు కుల అణచివేత
అ) వెట్టి వ్యవస్థలో, దిగువ కులాల వారు భూస్వాముల కోసం రోజువారీ ఉచిత కూలీ పనులు చేయవలసి వచ్చేది.
ఆ) పరిశుభ్రం, ఇంట్లో ఇతర పనులు చేయడం కోసం“ప్రతి దళిత కుటుంబం నుండి ఒక వ్యక్తిని రోజూ దొరల ఇంటికి పంపాలనే నియమాలు ఉండేవి.
ఇ) యువతులను భూస్వాముల ఇళ్లలో గృహ పనుల కోసం ఉంచి, తరచూ వారిపై దౌర్జన్యం చేసేవారు.
3. సాంస్కృతిక సమీకరణ మరియు అక్షరాస్యత ఉద్యమాలు
అ) కమ్యూనిస్టు కార్యకర్తలు గ్రామాల్లో గ్రంథాలయాలను నిర్మించి, అక్షరాస్యత మరియు రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తి చేశారు.
ఆ) ఈ గ్రంధాలయాలు కుల అణచివేత మరియు భూస్వామ్య అన్యాయాలపై నిర్వహించే చర్చలకు కేంద్రాలుగా మారాయి.
ఇ) సాంస్కృతిక ఉద్దీపన గ్రామ సమితుల ఆవిర్భావానికి దారితీసింది. ఇవి భూస్వాములకు సవాలుగా మారాయి.
4. ప్రజా సంస్థల ఏర్పాటు
అ) ఆంధ్ర మహాసభ 1930 నుండి ప్రజల సమస్యల పట్ల పోరాటాలను చేపట్టింది.
ఆ) మొదట కామారెడ్డి గూడెంలో (1940), తర్వాత కడవెండి వంటి ప్రాంతాలలో గ్రామ సమితిలో ఏర్పాటు చేశారు.
5. కమ్యూనిస్టు భావజాల ఆవిర్భావం
అ) మార్క్స్ మరియు ఎంగెల్స్ స్ఫూర్తితో, రాజ్ బహదూర్ గౌర్, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి నాయకులు రైతులను సమీకరించారు.
ఆ) 1939లో మఖ్దూమ్ మొహియుద్దీన్ మరియు ఇతరులచే కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడింది.
ఇ) 1940లో రావి నారాయణ రెడ్డి మరియు బడ్డం ఎల్లారెడ్డిచే హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ విభాగం ఏర్పాటు చేయబడింది.

II. ఆర్థిక కారణాలు: 1. భూసాంద్రత మరియు జాగీర్దార్ వ్యవస్థ
అ) దొరలు (భూస్వాములు) లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని, రైతులను కౌలుదారులుగా లేదా భాగస్వాములుగా చేసి దోపిడీ చేశారు. ఉదాహరణ: జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి – 1.5 లక్షల ఎకరాలు, రాపాక వెంకట రామచంద్ర రెడ్డి – 40,000 ఎకరాలు.
ఆ) కౌలు హక్కులు లేకపోవడంతో రైతులను ఇష్టానుసారం భూమి నుండి తొలగించేవారు.
ఇ) వ్యవసాయం ఆహార భద్రత కోసం కాక, సంపద సేకరణ కోసం ఉపయోగించారు.
2. దోపిడీ మరియు బలవంతపు పన్నులు
అ) రైతులు తమ పంటలో 50% వరకు భూస్వాములకు కౌలుగా సమర్పించవలసి వచ్చేది.
ఆ) ‘హుక్కీ మాలికన్నా’ అనే ప్రత్యేక పన్ను కల్లు గీత కార్మికుల పై వేసేవారు.
ఇ) అనేక ప్రాంతాల్లో అక్రమ సుంకాలు మరియు బలవంతపు విరాళాలు వసూలు చేయబడ్డాయి.
3. అప్పు బానిసత్వం మరియు నాగు వడ్డీ వ్యవస్థ
అ) స్థానిక వడ్డీ వ్యాపారులు ‘ నాగు వడ్డీ’ ద్వారా రైతులను దోచుకునేవారు. ఈ వడ్డీ విధానంలో ప్రతి సంవత్సరం రుణం రెట్టింపు అయ్యేది.
ఆ) రైతులు తమ భూమి, పశువులు మరియు ఇళ్లను అప్పులకు కోల్పోయేవారు.
ఇ) ఇది చిన్న రైతులు మరియు చేనేత కార్మికులలో తరతరాల దారిద్ర్యానికి దారితీసింది.
4. భూ సంస్కరణల లోపం
అ) నిజాం పాలనలో కౌలు సంస్కరణలు లేదా భూ పునర్విభజన ఎన్నడూ ప్రవేశపెట్టబడలేదు.
ఆ) కౌలు రైతులకు భూమి యాజమాన్య ర హక్కులు లేకపోవడంతో చట్టపరమైన రక్షణ ఉండేది కాదు.
ఇ) భూ అసమానత తరతరాలుగా కొనసాగి, గ్రామీణ సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది.
5. స్థానిక దేశ్ముఖ్ క్రూర దోపిడీ
అ) విసునూర్ దేశ్‌ముఖ్ రాపాక వెంకట రామచంద్ర రెడ్డి నిరంకుశత్వానికి ప్రతీకగా నిలిచాడు:
i. కామారెడ్డి గూడెం (1940) – వెట్టికి వ్యతిరేకంగా నిలిచిన రైతు షేక్ బందగీని హత్య చేసాడు.
ii. పాలకుర్తి (1944–45) – చాకలి ఐలమ్మ అతని భూకబ్జాకు వ్యతిరేకంగా నిలిచి ప్రతిఘటనకు నాంది పలికింది.
iii. కడవెండి (1946) – అతని అణచివేతకు వ్యతిరేకంగా మొదటి గ్రామ సమితి ఏర్పడింది. తర్వాత నల్గొండలో దొడ్డి కొమరయ్య హత్య (1946) జన ఉద్యమానికి తిరుగుబాటు మంటలను రగిలించింది.

ముగింపు
తెలంగాణ రైతుల సాయుధ పోరాటం ప్రపంచవ్యాప్తంగా దోపిడీ వ్యతిరేక ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచింది. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, పటేల్‌లు, పట్వారీల అనియంత్రిత అధికారాన్ని అంతం చేసింది. 3,000కి పైగా గ్రామ సమితులతో, ఇది తెలంగాణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలనకు నాంది పలకడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ‘జై తెలంగాణ’ అనే నినాదం ఈ పోరాట ఫలితంగా జన్మించిన ఆకాంక్షగా చరిత్రలో నిలిచింది. 

  Additional Embellishment: