TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sat May 10, 2025

Q. సాలార్ జంగ్ సంస్కరణలు ఆధునిక తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు పునాదులుగా భావించబడతాయి. దీనిని విమర్శనాత్మకంగా విశ్లేషించండి.

పరిచయం:
1853లో ముదటి సాలార్ జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, రాజ్యం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నిజాం ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ఆభరణాలు, రాజరిక ఆస్తులన్నిటినీ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో మొదటి సాలార్ జంగ్ నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, పరిపాలనలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన విధానాలు ఆధునిక తెలంగాణ పరిపాలనా వ్యవస్థకు పునాదిగా నిలిచాయి.

విషయం:
I. హైదరాబాద్ పరిపాలనలో ఆధునికతకు నాంది పలికిన సంస్కరణలు (1853–1883)

1. పరిపాలనా పునర్నిర్మాణం:
a. పరిపాలనను కేంద్రీకృతంగా మార్చి 14 శాఖలుగా విభజించారు. ఇది నేటికీ కొన్ని విధానాల్లో కనిపిస్తుంది.
b. జిలా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని 5 సుబాలు, 17 జిల్లాలుగా విభజించారు.
c. సామర్థ్యంతో కూడిన హిందూ (ఉదా: మహారాజా కిషన్ పర్షద్) మరియు ముస్లిం (ఉదా: సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ) అధికారులను నియమించారు.
2. పన్ను మరియు ఆర్థిక సంస్కరణలు:
a. బటాయి వ్యవస్థను రద్దు చేసి, నగదు పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు.
b. ఆదాయ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆదాయ బోర్డు, సదర్ మహఖే ఎమెల్ గుజారీ వంటివి ప్రయోగాత్మకంగా నడిపించారు.
c. 1875లో భూవర్గీకరణ కోసం సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖను స్థాపించారు.
3. న్యాయ, పోలీస్ శాఖలలో సంస్కరణలు:
a. మజ్లిస్-ఎ-మురాఫా అనే సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి, నజీమ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
b. జిల్లా స్థాయిలో అధికారులు పనిచేస్తున్న దశలను పర్యవేక్షించేందుకు మహ్కమా-ఇ-సదర్ అనే హైకోర్టును నెలకొల్పారు.
c. ఆదాయ శాఖ, పోలీసు శాఖలను వేరు చేసి, 1865లో మహఖాయ్-ఇ-కోత్వాలీ పేరిట పోలీసు వ్యవస్థను పునర్నిర్మించారు.
d. దొంగతనాల నియంత్రణకు "నిజా అమాతా" అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు.
4. విద్యా రంగ అభివృద్ధి:
a. 1855లో దారుల్ ఉలూంను స్థాపించి, తూర్పు-పడమర విజ్ఞాన సమ్మేళనంతో నూతన విద్యా వ్యవస్థకు నాంది పలికారు.
b. 1870లో సిటీ హై స్కూల్, 1873లో మదర్సా-ఇ-ఆలియా, 1881లో గ్లోరియా గర్ల్స్ స్కూల్‌ను ప్రారంభించారు.
c. ఉర్దూను పరిపాలన, విద్యా భాషగా ప్రోత్సహించారు. అలాగే ఇంగ్లీషు ప్రచురణలకు కూడా మద్దతు ఇచ్చారు.
5. ఆర్థిక మరియు రవాణా రంగాల్లో చర్యలు:
a. 1868లో హైదరాబాద్-షోలాపూర్ మధ్య గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించారు.
b. 1869లో నిజాం స్టేట్ రైల్వే ప్రారంభించి, బ్రిటీష్ ఇండియాతో అనుసంధానాన్ని మెరుగుపరిచారు.
c. 1885లో ప్రభుత్వ మింట్, జిల్లాల ఖజానాలు ఏర్పాటు చేసి కరెన్సీ నియంత్రణను కేంద్రీకరించారు.
II. సాలార్ జంగ్ సంస్కరణలపై గల పరిమితులు మరియు విమర్శనాత్మక విశ్లేషణ
1. నగర మరియు అగ్రవర్ణ కేంద్రీకృత విధానం:
a. సంస్కరణలు ప్రధానంగా హైదరాబాద్ కేంద్రితమై ఉండి, నగరంలోని అగ్రవర్గాలకే లాభదాయకంగా మారాయి.
b. గ్రామీణ తెలంగాణలో మౌలిక వసతులు, సేవలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయి.
2. వ్యవసాయ రంగం నిర్లక్ష్యం:
a. భూ పంపిణీ, పట్టాదారు వ్యవస్థలకు సంబంధించిన సంస్కరణలు తీసుకురాలేదు.
b. జాగీర్దారుల రాజరిక ఆధిపత్యం కొనసాగింది.
3. ప్రజాస్వామ్య భాగస్వామ్యం లేకపోవడం:
a. పరిపాలన కేంద్రీకృతంగా కొనసాగింది.
b. స్థానిక పాలక సంస్థలు, పంచాయితీలు లేకపోవడం ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించింది.
4. బ్రిటిష్ ఆధారత మరియు వలసభావ పరిపాలన:
a. సాంకేతికంగా ఈ సంస్కరణలు బ్రిటిష్ నమూనాల ఆధారంగా రూపొందించబడ్డాయి.
b. స్థానిక అవసరాల కంటే బ్రిటిష్ వారి ప్రయోజనాలకే ఆ సంస్థలు దోహదం చేశాయి.
5. స్థానిక ప్రజలను నిర్లక్ష్యం – ముల్కీ ఉద్యమం మూలాలు:
a. సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ, సయ్యద్ అలీ బిల్గ్రామీ వంటి స్థానికేతరుల నియామకం స్థానికుల మధ్య అసంతృప్తికి దారితీసింది.
b. ఈ విధానం తెలుగువారి సామాజిక-రాజకీయ ఎదుగుదలపై ప్రభావం చూపింది.
c. హైదరాబాదులో ఉర్దూ భాష ఆధిపత్యం కొనసాగడం అనేది ముల్కీ ఉద్యమం అనే స్థానిక ఉద్యమానికి బీజం వేసింది.

ముగింపు
మొదటి సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు హైదరాబాద్ పరిపాలనను ఆధునిక దిశలో నడిపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఇవి ఆధునిక తెలంగాణ పరిపాలనపై ప్రభావం చూపినప్పటికీ, స్థానికులకు ప్రయోజనకరంగా మారకపోవడం వల్ల ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. ఈ అసమానతలే అనంతరం ముల్కీ ఉద్యమానికి దారితీశాయి.

  Additional Embellishment: