There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Wed May 7, 2025
పరిచయం:
1857 తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు ఎదురైన తొలి ప్రధాన సవాలుగా చరిత్రలో నిలిచింది. అయితే హైదరాబాదు రాష్ట్రం అధికారికంగా బ్రిటిష్‌వారికి మద్దతిచ్చినప్పటికి, తుర్రెబాజ్ ఖాన్ అనే ధైర్యవంతుడి నాయకత్వంలో శక్తివంతమైన తిరుగుబాటు జరిగింది. "హైదరాబాద్ మరిచిన వీరుడు"గా గుర్తింపు పొందిన తుర్రెబాజ్ ఖాన్ (తురుమ్ ఖాన్) ధైర్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచి, తెలంగాణలో వలస పాలనకు వ్యతిరేకంగా తొలి ప్రజాస్వామిక చైతన్యానికి మార్గదర్శిగా నిలిచాడు.
విషయం:
తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ పరిణామాలు:
1. నిజాం యొక్క రాజకీయ విధేయత:
-అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారితో మైత్రీ కుదుర్చుకొని వారి పరిపాలనకు మద్దతు ఇచ్చాడు.
2. కరపత్రాలతో ప్రచారాలు:
-మౌలవి ఇబ్రాహీం మరియు మౌలవి అల్లాఉద్దీన్ వంటి వారు బ్రిటిష్ వ్యతిరేక భావజాలాన్ని ప్రజలలో ప్రచారం చేశారు.
3. ఔరంగాబాద్ తిరుగుబాటు:
-మీర్ ఫిదా అలీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా, కెప్టెన్ అబ్బాట్ చేతిలో హతమయ్యాడు.
4. చీదా ఖాన్ తిరుగుబాటు:
-బుల్ధానాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. తరువాత పట్టుబడి కోటి రెసిడెన్సీలో నిర్బంధించబడ్డాడు.
5. ప్రజల్లో అసంతృప్తి:
-తిరుగుబాటుదారుల అరెస్టులు ప్రజల్లో కోపాన్ని రేకెత్తించాయి. ఇది తుర్రెబాజ్ ఖాన్ కు ప్రేరణను ఇచ్చింది.
తుర్రెబాజ్ ఖాన్ పాత్ర:
1. హైదరాబాద్లో తిరుగుబాటు ప్రారంభం (జూలై 17, 1857):
-చీదాఖాన్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో బ్రిటిష్ రెసిడెన్సీపై ప్రత్యక్ష దాడి జరిగింది.
2. నాయకత్వం మరియు సాయుధ బలగాలు:
-తుర్రెబాజ్ ఖాన్, మౌలవి అల్లాఉద్దీన్ కలిసి రోహిల్లా సైన్యానికి నాయకత్వం వహించారు. నిజాం ప్రభుత్వ ప్రాంతంలోని బ్రిటిష్ అధికారానికి ఇదొక బలమైన సవాలుగా మారింది.
3. తిరుగుబాటు దమన చర్యలు:
-బ్రిటిష్ రెసిడెంట్ కర్నల్ డేవిడ్సన్ మరియు మేజర్ బ్రిగ్స్ ఈ తిరుగుబాటును అత్యంత దారుణంగా అణిచేశారు.
4. తప్పించుకునే ప్రయత్నంలో ఆశ్రయం:
-తుర్రెబాజ్ ఖాన్, సుల్తాన్ బజార్ ప్రాంతంలో జై గోపాల్ దాస్, అబ్బాస్ సాహెబ్ ఇళ్ళలో ఆశ్రయం పొందాడు. ఇది గుట్టుగా ఉన్న స్థానిక మద్దతును సూచిస్తుంది.
5. యుద్ధంలో ప్రాణనష్టం మరియు పరార్:
-రోహిల్లా సైనికుల్లో పలువురు హతమయ్యారు. తుర్రెబాజ్ ఖాన్, మౌలవి అల్లాహ్ ఉద్దీన్ కొంతకాలం నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం వారు కూడా పట్టుబడ్డారు.
తుర్రెబాజ్ ఖాన్ తిరుగుబాటు ప్రాధాన్యత:
1. స్థానిక ప్రతిఘటనకు మార్గదర్శి:
-నిజాం వంటి విధేయ రాజ్యాలలో కూడా వలస పాలనకు వ్యతిరేకత ఉన్నదని స్పష్టంగా చాటిచెప్పాడు.
2. బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేసిన ఘట్టం:
-ప్రజా స్థాయిలో కూడ తిరుగుబాటు చెలరేగవచ్చునని చూపిస్తూ, వలస పాలనకు మరియు స్థానిక రాజరిక అధికారాలకు సవాలు విసిరాడు.
3. హుతాత్మత్వ ప్రతీక:
-బ్రిటిష్ వారు తుర్రెబాజ్ ఖాన్‌ను చిత్రహింసలకు గురిచేసి ప్రజల ముందే ఊరి తీయడంతో, ప్రజలలో అతనికి అవినాభావమైన మద్దతు లభించింది. ఇది జాతీయ చైతన్యానికి బలం చేకూర్చింది.
4. ప్రేరణాత్మక వారసత్వం:
-1860లో జరిగిన రామ్‌జీ గోండ్ గిరిజన తిరుగుబాటుకి ఇతని పోరాటం ప్రేరణగా నిలిచింది.
5. చరిత్రలో స్థానం:
-చరిత్రలో ఎక్కువగా ప్రస్తావించబడకపోయినప్పటికీ, తెలంగాణ ప్రాంత జ్ఞాపకాల్లో తుర్రెబాజ్ ఖాన్ కథ తిరుగుబాట్లకు మూలప్రేరకంగా నిలిచింది.
ముగింపు
తుర్రెబాజ్ ఖాన్ తిరుగుబాటు పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ, అది తెలంగాణను భారతదేశపు స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశపెట్టింది. అతని ధైర్యం, త్యాగం వలస పాలనను మాత్రమే కాకుండా, నిజాం విధేయతను కూడ సవాలు చేసింది. ఈ పోరాటం రామ్‌జీ గోండ్ ఉద్యమానికి వేదికగా నిలిచి, తెలంగాణలో జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి నైతిక బలాన్ని ఇచ్చింది.